Saturday, May 25, 2013

Jr NTR - Mahesh babu comparision - jr NTR mistakes in his career - awesome article in andhrabhoomi - Must read article


Awesome article chala balanced ga raasadu.. politics loki vacchi.. vayasuki minchi matladithey emi avuthundo chakka ga chepparu..

ayina okati 2009 lo NTR kevelam NBK and CBN prothsaham vallane ne politics loki vacchadu.. kani chuttu pakkana cherina bajana batch valla chedi poyadu.. junior should know this soon.




మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు హీరోలు, ఇద్దరివి భిన్న దృక్పథాలు. ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఉండాలని కోరుకోవడం కూడా తగదు. అలానే ఈ ఇద్దరు హీరోల్లో ఎవరి ప్రత్యేకత వారిదే. తెలుగు చలన చిత్ర సీమలో ఇద్దరు టాప్ హీరోలు. ఇద్దరిలో ఒకసారి ఒకరిది పై చేయిగా నిలిస్తే మరోసారి మరొకరిది.
సూపర్ స్టార్ కుమారుడిగా మహేష్‌బాబు సులభంగానే చిత్ర సీమలో నిలదొక్కుకో గలిగారు. అతని క్రెడిట్ మొత్తం తండ్రికే చెందుతుందని చెప్పలేం. సూపర్ స్టార్ కుమారుడిగానే సినిమాలో నిలదొక్కుకో గలిగితే మహేష్‌బాబు అన్న రమేష్‌బాబు మహేశ్ కన్నా ముందు హీరోగా నిలదొక్కుకునే వారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ బాల నటునిగా ఎన్నో ఒడుదుడుగులను ఎదుర్కొని స్వయం కృషితో ఎదిగారు. ఆది సినిమాతో టాప్ పొజిషన్‌కు వెళ్లాడు.
వివాదాలు, రాజకీయాలు వేటితో సంబంధం లేకుండా మహేష్‌బాబు తన కెరీర్‌పైనే దృష్టి సారించి ముందుకు దూసుకువెళుతుంటే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అప్రయత్నంగా కొన్ని వివాదాల్లో, తనకు ఏ మాత్రం సంబంధం లేకుండా కొన్నింటిలో తలదూరుస్తున్నారు.
టాప్ స్థాయిలో ఉన్నప్పుడు జేజేలు పలికే సినిమా హితులు, ఫెయిల్యూర్స్ తలుపు తట్టిందా? కంటికి కనిపించకుండా మాయం అవుతారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నదే అయినా సినిమా రంగంలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.
తొలి తరం సినిమా నటులంతా వామపక్షాల నుంచి వచ్చిన వారే. ఇతర నటీనటులు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండడం వల్ల వారిపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ టాప్‌లో ఉన్న హీరోలు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా, ఏదో ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభావం అతని కెరీర్‌పై కచ్చితంగా పడుతుంది.
కాసు బ్రహ్మానందరెడ్డి మొదలుకొని మర్రి చెన్నారెడ్డి వరకు ఎందరో ముఖ్యమంత్రులతో అక్కినేని నాగేశ్వరరావుకు పరిచయాలు ఉండేవి. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు మాత్రం రాజకీయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా సినిమాలకే పరిమితం అయ్యారు. ఇలాంటి కొందరు రాజకీయ దిగ్గజాల గురించి వాళ్ళేవరు అని ఎన్టీఆర్ అడిగేవారని ఒక సభలో అక్కినేని నాగేశ్వరరావు తెలిపారు. రాజకీయ నాయకులతో ఎక్కువగా పరిచయం ఉన్న తాను రాజకీయాల్లోకి వస్తానని అంతా అనుకున్నారు కానీ నాయకులతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండే ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారని ఎవరూ ఊహించలేదు అని అక్కినేని చెప్పుకొచ్చారు.
ప్రతి చోట ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఎన్టీఆర్ మార్గానికి భిన్నంగా వెళుతూ ఇప్పటికే కొంత దెబ్బతిన్నారు. మహేష్ బాబుకు, జూనియర్ ఎన్టీఆర్‌కు ఇక్కడే తేడా ఉంది.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పద్మాలయ భూమికి సంబంధించిన అంశంపైన కృష్ణ వైఎస్‌ఆర్‌ను కలిశారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు కొందరు 2009 కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మహేష్‌బాబు పాల్గొంటారని ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ప్రకటనను మహేష్‌బాబు సమర్ధించలేదు, ఖండించలేదు. అసలు పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోయారు.
2009 ఎన్నికలకు ముందు గుంటూరులో జరిగిన టిడిపి యువగర్జనలో బాలకృష్ణ పాల్గొన్నారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. సినిమా నటునిగా తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూనియర్ వ్యూహాత్మకంగా బాగానే వ్యవహరిస్తున్నారని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ టిడిపి విజయం కోసం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.
ఒకవైపు దాదాపు అన్ని ప్రతిపక్షాలు కలిపి మహాకూటమి ఏర్పాటు చేశారు, బలమైన మీడియా
అండగా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ విస్తృతంగా ప్రచారం చేశారు. టిడిపి నాయకత్వంలోని మహాకూటమి విజయం ఖాయం అని భావించారు. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడం, అతని సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఎన్నికల్లో జూనియర్ భూ కంపం సృష్టిసారనే ప్రచారం సాగింది. అయితే ఎన్నికల ఫలితాలు చూస్తే సినిమా హీరోల కన్నా జనం రాజకీయ హీరోగా వైఎస్‌ఆర్‌నే ఎక్కువ ఆదరించారు.
క్యారక్టర్ నటులు ఏదో ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తే అది వేరు. కానీ టాప్ స్థాయిలో ఉన్న హీరో ఒక పార్టీ తరఫున ప్రచారం చేయడం వల్ల రాజకీయంగా ఆ పార్టీకి ప్రయోజనం కలగవచ్చు కానీ సినిమా నటునికి మాత్రం కచ్చితంగా అది నష్టం కలిగిస్తుంది. ఎన్టీఆర్ సినిమా జీవితం ముగింపు దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ సైతం అంతే. కానీ జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి అది కాదు. అతనికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. తాను తీసుకునే నిర్ణయాలపైనే తన భవిష్యత్తు ఉంటుందని అతను ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ పార్టీకి దూరంగా ఉంటే ఒక బాధ, చేరువ అయితే మరో బాధ. తామరాకుమీద నీటిబొట్టులా అంటీ ముట్టనట్టుగా లౌక్యం ప్రదర్శించాలి. కథ బాగుండి, సినిమా బాగుంటే జనం చూస్తారు, హీరో ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తే జనానికేం అని వాదించే వాళ్లు ఉండవచ్చు. కానీ హీరో రాజకీయ అనుబంధం ప్రభావం సినిమా విజయంపై తప్పకుండా పడుతుంది.
అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. జనంలో అటు సగం, ఇటు సగం ఉంటారు. రెండు పక్షాల మధ్య మూడు నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంటుంది. గ్రామ స్థాయి వరకు రెండు ప్రధాన పక్షాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఒక పార్టీకి హీరో ప్రచారం చేస్తే, ఆ పార్టీని అభిమానించే వారికి బాగానే ఉంటుంది, కానీ కేవలం ఈ కారణం చేతనే ఆ హీరోను దూరం చేసుకునే సినిమా అభిమానుల సంఖ్య కూడా అంతో ఇంతో ఉంటుంది.
టిడిపికి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ అతిగా ప్రచారం చేశారు. డైలాగులు సైతం తన వయసుకు, రాజకీయ పరిణితికి మించి మాట్లాడారు. ఆ పార్టీకి అండగా నిలిచే మీడియా జూనియర్ ఎన్టీఆర్ మాటలను అతిగా ప్రచారం చేసింది. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే జూనియర్ ఎక్కడ పర్యటించారో అక్కడ పార్టీ ఓడింది అనే ప్రచారం జరిగింది. నిజానికి ఆ పార్టీకి ప్రచారం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ జీవం పోశారు. అభిమానం ఓట్ల రూపంలో మారడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. పైగా జనాకర్షణ గల నేతకు వ్యతిరేకంగా ప్రచారం సాగించడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
పార్టీ కోసం తన సినిమా జీవితాన్ని పణంగా పెట్టి జూనియర్ ఎన్టీఆర్ అంతగా ప్రచారం చేసినా తరువాత జరిగిన పరిణామాలు జూనియర్‌కు ఇబ్బంది కరంగా మారాయి.
ఒకవైపు తెలంగాణ వాదుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకత ఎదుర్కోవలసి రాగా, అదే సమయంలో తాను ఏ పార్టీ కోసం అయితే ప్రచారం చేశాడో, అదే పార్టీ అభిమానుల నుంచి తాను వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణను వ్యతిరేకిస్తున్నారనే ఉద్దేశంతో తెలంగాణలో అతని సినిమాకు తెలంగాణ వాదులు అడ్డంకులు కల్పించారు. చివరకు తాను హైదరాబాదీనని జూనియర్ ప్రకటించుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని సినిమా ప్రదర్శనకు అడ్డంకులు లేకుండా చేసుకున్నారు. ఆ తరువాత పరిణామాలతో చివరకు టిడిపికి అండగా నిలిచే బలమైన వర్గం నుంచే జూనియర్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. అదుర్స్ సినిమా విడుదల అయిన మొదటి రోజే సినిమా ప్లాప్ అంటూ తెలుగు యువత నాయకులు ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక పార్టీని జూనియర్ భుజాన మోయడం వల్ల ఇతర పార్టీలకు చెందిన అభిమానులు దూరమయ్యారు. ఇప్పుడు తాను మోసిన పార్టీ వాళ్లు సైతం దూరమయ్యారు. జూనియర్ పరిస్థితి రెంటికి చెడ్డట్టు అయింది. ఆయన ఇటీవల విజయవాడలో పర్యటిస్తే, పార్టీ శ్రేణులు ఎవరూ హాజరు కావద్దని బాలకృష్ణ ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే పార్టీ వారెవరూ హాజరు కాలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తన మానాన తాను ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో, కానీ పార్టీ తరఫున ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు రెంటింకి చెడ్డట్టు అయ్యారు. 2009 ఎన్నికల్లో ఒక పార్టీకి ఎందుకు ఓటు వేయాలో గంటల తరబడి, పేజీలకు పేజీలు ఉపన్యాసం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మూడేళ్లు గడిచిన తరువాత నాకు రాజకీయాల గురించి తెలియదు, తనది రాజకీయాల గురించి అవగాహన చేసుకునేంత వయసు కాదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
గుడివాడ ఎమ్మెల్యే నానికి పట్టుపట్టి టికెట్ ఇప్పించుకున్నారు. తీరా అతను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరడంతో ఎవరూ అడగకపోయినా హడావుడిగా జూనియర్ ఎన్టీఆర్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి నాని పార్టీ మారడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవలసి వచ్చింది.
నిజానికి ఎన్టీఆర్ వారసునిగా జూనియర్ ఎన్టీఆర్‌ను నిలబెట్టడానికి ఆ కుటుంబ సభ్యులేమీ చేయూత నివ్వలేదు. పైగా తారకరత్నకు ఆ స్థానం కల్పించడం కోసం కుటుంబం మొత్తం ప్రయత్నించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే హీరోతో ఒక రోజు తొమ్మిది సినిమాలను ప్రారంభించారు. రికార్డు మిగిలింది కానీ ఒక్క సినిమా కూడా సరిగా నడవలేదు. ఈ మితిమీరిన ప్రచారమే అతన్ని దెబ్బతీసింది. జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కాడు.
హీరోగా భారీ ఎత్తున అభిమానులను సంపాదించుకున్నప్పుడు దాన్ని తమ పార్టీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని ఏ నాయకుడైనా అనుకుంటాడు. అలా అనుకోవడం అతని తప్పేమీ కాదు. కానీ ఒక పార్టీకి ఉపయోగపడే ముందు తన కెరీర్‌కు సంబంధించి అది ఎంత వరకు ప్రయోజనం అని ఆ నటుడు ఆలోచించుకోవాలి. తన ఇమేజ్‌ను ఉపయోగించుకునే పార్టీ పగబడితే ఎలా ఉంటుందో జూనియర్‌కు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతూ ఉండవచ్చు. తామరాకుమీద నీటిబొట్టులా ఔను అనకుండా కాదు అనకుండా తన పని తాను చేసుకుపోవడం తెలివైన హీరో లక్షణం. మహేశ్ బాబు చేస్తున్నది అదే. మహేశ్‌బాబు తండ్రి కృష్ణ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిగా కూడా ఎన్నికయ్యారు. కానీ మహేశ్‌బాబు మాత్రం తన మీద ఎలాంటి రాజకీయ ముద్ర పడుకుండా చూసుకుంటున్నారు.
ఒకవైపు కుటుంబ రాజకీయాలు కాగా మరోవైపు తెలంగాణ వ్యవహారంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. రెండు పార్టీల అభిమానుల్లో ఒక పార్టీ వారిని దూరం చేసుకోవడం ఎలా నష్టమో, ఒక ప్రాంతాన్ని దూరం చేసుకోవడం కూడా అంతే నష్టం. ఒక పార్టీకి చేరువ కావడం వల్ల మరో పార్టీ అభిమానులైన 50 శాతం మందిని దూరం చేసుకున్నట్టే, ఒక ప్రాంతానికి వ్యతిరేకి అనే ముద్ర పడితే అదే విధంగా నష్టం కలుగుతుంది.
తనది చిన్న వయసు, సినిమా రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. పోటీని తట్టుకుని ముందు వరుసలో నిలబడితే కాలం కలిసి వస్తే వయసు మీరిన తరువాత రాజకీయాల్లో ఎలాగూ అవకాశాలు ఉంటాయి. టాప్ స్థాయిలో ఉంటేనే రమ్మని ఆహ్వానిస్తారు, గౌరవిస్తారు, ఈ విషయంలో మిగిలిన అందరి కన్నా జూనియర్‌కే ఎక్కువ అనుభవం. ఇప్పుడు జూనియర్ ఆలోచించాల్సింది పార్టీలు, ప్రాంతీయ ఉద్యమాల గురించి కాదు. తన గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. తానున్నది అడుగులు తడబడితే చేయూత నిచ్చేవారు కనిపించని రంగం అని హీరోలు గుర్తించాలి.
©www.myreviews4all.blogspot.com