Thursday, May 29, 2014

Akkineni Akhil interview in Andhra Jyothi / AJ


Akhil Kurrodi lo Matter vundi.. Telugu Film industry ki next biggest star avvabothunnadu ani kacchitam ga anipisthondi.
first film gurinchi details june 10th lopu announce chestharu ani confirm chesadu



"చిన్నప్పట్నించే యాక్టర్‌ని కావాలని మైండ్‌లో ఫిక్సయి ఉంది. యాక్టర్ల ఫ్యామిలీలో పెరుగుతూ, నేనెందుకు యాక్టర్‌ని కాను? అది కాకుండా వేరే ఏముంది? అనుకునేవాణ్ణి'' అని చెప్పారు అఖిల్ అక్కినేని. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కలిసి నటించిన 'మనం' సినిమా క్లైమాక్స్‌లో మెరుపులా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు అఖిల్. ఆ సినిమా అనుభవంతో పాటు హీరోగా తన కెరీర్‌ను ఎప్పుడు ఆరంభించబోతున్నారు? అమ్మా నాన్నలు అమల, నాగార్జున, అన్నయ్య చైతన్యతో తనకి ఎలాంటి అనుబంధం ఉంది? ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు? హీరోల్లో ఎవరంటే ఇష్టం? వంటి అంశాలపై మంగళవారం తమ ఇంట్లో 'నవ్య'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విపులంగా మాట్లాడారు అఖిల్. ఆసక్తికరమైన ఆ విశేషాలు...

'మనం'లో మీరు నటించడం లేదని నాన్నగారు మాకు అబద్ధం చెప్పారు. చూస్తే సినిమాలో మీరున్నారు..
అలా చెప్పాల్సొచ్చిందండీ. క్లైమాక్స్‌లో ఆ సర్‌ప్రైజ్, సస్పెన్స్ ఉండాలని అలా చెప్పారు. అది వర్కవుట్ అయ్యింది. మీ అందరికీ అది నచ్చుతుందనే అలా చెప్పాం. క్లైమాక్స్‌కి అదే కిక్. సినిమా రిలీజయ్యేదాకా అఖిల్ ఉన్నాడా, లేదా అనే సస్పెన్స్ ఉండింది. దాన్నలాగే మెయిన్‌టైన్ చేశాం.
'మనం'లో చేయడం ఎలా అనిపించింది?
వావ్.. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. అలాంటి ఇంట్రడక్షన్‌ను కలలో కూడా ఊహించుకోలేదు. హీరోగా పరిచయ చిత్రం చేస్తే మామూలుగానే ఉండేది. నేను స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నప్పుడు కరెక్ట్ టైమ్‌కు డైరెక్టర్ విక్రమ్‌కుమార్ వచ్చారు. ఈ క్లైమాక్స్ సీన్‌ను వివరించారు. అది విన్నప్పుడే ఎగ్జయిట్‌మెంట్ వచ్చేసింది కానీ చిన్న డౌట్ ఉండింది. ఏ యాక్టర్ కూడా ఇలా పరిచయం కాలేదు, హీరోగా చేయకుండా ఓ అతిథి పాత్రతో పరిచయమైతే మంచిదా, కాదా? ఒకవేళ నేను ప్రేక్షకులకు నచ్చకపోతే విమర్శలొస్తాయి. ఆ తర్వాత నా పరిస్థితేంటి? అనే ఆలోచనలొచ్చాయి. అప్పుడు తాతయ్యను అడిగాను. "నువ్వు చేస్తే సినిమాకు ప్లస్, నీకు ప్లస్. నష్టమనేది ఉండదు. నీది ఒకటిన్నర, రెండు నిమిషాల పాత్ర. నిన్న డాన్సులు కానీ, ఇంకోటి కా చేయమనట్లేదు. ఆ సీన్‌లో నడుస్తున్నావంతే'' అని ఆయన ధైర్యం చెప్పారు. దాంతో భయం పోయింది. ప్రధానంగా నాకు విక్రమ్ విజన్ నచ్చింది. ఆ సీన్‌లో హెల్మెట్ ఎలా తీస్తాను, ఎలా నడుస్తాను అనేది తను చేసి చూపించాడు. ఫస్ట్ షాట్‌తోటే నాకు తెలిసిపోయింది, నా ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతోందో.
ఇందులో మీరు చెయ్యాలనేది మొదటి నుంచీ ఉందా?
లేదండీ. మధ్యలో వచ్చింది. క్లైమాక్స్‌లో నాగచైతన్య, సమంతను రక్షించడానికి నాగార్జున, శ్రియ బయలుదేరితో, వారిని కాపాడదామని నాగేశ్వరరావుగారు బయలుదేరతారు. తొంభై ఏళ్ల ఆయన వాళ్లని ఎలా కాపాడతారు? బిలీవబుల్‌గా ఉండదు. ఏమో. అలా చేసుంటే ఎలా వచ్చేదో తెలీదు. విక్రమ్‌కి ఆ డౌట్ వచ్చింది. 'ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ద క్లైమాక్స్' అని అన్నాడు. అతనికి నేను యాక్టింగ్ చేసే వయసుకు వచ్చాననే సంగతి తెలీదు. ఎక్కడో నన్ను కలిశాడు. ఆ తర్వాత నాన్నకు ఫోన్‌చేసి, నా సంగతి అడిగాడు. నాన్న మొదట షాకయ్యారు. తర్వాత కేరక్టర్ విన్నాక, సరేనన్నారు. అయితే చెయ్యాలా, వద్దా అనే చాయిస్ నాకే వదిలేశారు. అయితే తాతయ్యతో నటించే అవకాశం నాకు మళ్లీ రాదు. ఇది మిస్సయితే అంతే. చిన్నప్పట్నించీ ఆయనతో కలిసి నటించాలనే కోరిక నాలో ఉండింది. అయితే చేస్తానని అనుకోలేదు. అవకాశం వచ్చింది. చేశాను. దానికి వెరీ వెరీ హ్యాపీ.
మీ ప్రెజెన్స్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
ఏ యాక్టర్‌కైనా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు టెన్షన్ ఉంటుంది, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని. ఇందులో నా పర్ఫార్మెన్స్‌ను జడ్జ్ చేయడానికి ఏమీ లేదు. నా స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందనేది, నా వాయిస్ ఎలా ఉందనేది చూస్తారు. అనూప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సీన్‌కు రీరికార్డింగే మెయిన్. అందరికీ అది నచ్చినందుకు హ్యాపీ. ఆ సీన్‌లో నేను నాచురల్‌గా చేశాననీ, భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడనీ అమ్మా నాన్నలతో తాతయ్య అన్నారంట. నాతో ఎప్పుడూ డైరెక్టుగా అనలేదు.
నాగేశ్వరరావు గారికి 'మనం' సరైన నివాళి అనుకుంటున్నారా?
యాభై ఏళ్ల క్రితం తాతయ్య ఎన్నో ప్రయోగాలు చేశారు - 'దేవదాసు' కానీ, 'మూగ మనసులు' కానీ. అలాగే నాన్న కూడా చేశారు. నా దృష్టిలో కొత్త డైరెక్టర్లతో కానీ, కొత్త స్క్రిప్టులతో కానీ నాన్న చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదు. నిజం చెప్పాలంటే 'మనం' స్క్రిప్టు విన్నప్పుడు నేను భయపడ్డాను. ఈ సినిమా కథేంటి అని ఎవరైనా మనల్ని అడిగితే, మనం చెప్పడానికి ప్రయత్నిస్తే మెంటలెక్కి పోతుంది. మరీ కాంప్లికేటెడ్ స్టోరీ. విక్రమ్ అంత మంచి డైరెక్టర్ కాబట్టి, దాన్ని ఒక సింపుల్ స్టోరీలా చెప్పగలిగాడు. స్క్రీన్‌ప్లే అంత బాగా చేశాడు కాబట్టి అంత స్మూత్‌గా వచ్చింది. మూడు తరాలు, పునర్జన్మలు, అన్ని పాత్రలు, ఫ్లాష్‌బ్యాక్‌లు.. అమ్మో.. కాంప్లికేటెడ్. ఈ సినిమాలో నాలుగు కథలున్నాయి. వాటిని అంత అందంగా చెప్పిన క్రెడిట్ విక్రమ్‌దే. అంత కాంప్లికేటెడ్ స్టోరీని ఒప్పుకుని చేసినందుకు, అది హిట్టయినందుకు నాన్నకు క్రెడిట్ ఇవ్వాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే కొద్ది రోజులే గుర్తుంటుంది. కానీ ఇలాంటి సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. అందుకే ఇది తాతయ్యకు ఓ మంచి నివాళిగా నేను భావిస్తున్నా.
ఒక ప్రేక్షకుడిగా చూసినప్పుడు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య పాత్రల్లో ఎవరి పాత్ర మీకు బాగా నచ్చింది? ఎందుకు?
నాన్న కేరక్టర్ నాకు బాగా నచ్చింది. 'బిట్టు' అనేది వెంటనే నచ్చే ఇన్నోసెంట్ కేరక్టర్. అందరూ ఆ పాత్రతో ఆడుకుంటూ ఉంటారు. అయితే నేను పర్ఫార్మెన్స్ చూసి బాగా ఆశ్చర్యపోయింది అన్నయ్యది. నటనలో చాలా చాలా మెరుగయ్యాడని అనిపించింది. తొలిసారి తాతయ్య, నాన్నతో కలిసి సీన్ చేస్తున్నప్పుడు అన్నయ్య టెన్షన్ ఫీలయ్యాడు. నాన్నని 'బిట్టూ' అని పిలుస్తుండాలి. తాతయ్యను 'ముసలోడా' అని పిలుస్తుండాలి. పైగా తాగి మాట్లాడాలి. అది వింతగా అనిపించే వాతావరణం. అప్పుడు అన్నయ్య నటన నాకు బాగా నచ్చింది. సమంత, శ్రియ కూడా కేరక్టర్లకు బాగా కనెక్టయ్యారు. ఐదుగురూ బ్రిలియంట్‌గా పర్ఫార్మ్ చేశారు. నాన్నకూ, శ్రియకూ ఎప్పట్నించో మంచి కెమెస్ట్రీ ఉంది. మంచి పెయిర్‌గా కనిపిస్తారు. అలాగే 'ఏమాయ చేశావే' నుంచి చైతన్య, సమంత గుడ్ పెయిర్ అనిపించుకున్నారు. కళ్లకి ఈ జంటలు బాగున్నాయి. కానీ కేరక్టర్‌గా చూసినప్పుడు నాన్నదే బాగా నచ్చింది.
సినిమా వాతావరణంలో పెరిగి, క్రికెట్ వైపు మొగ్గారు. తిరిగి సినిమాల వైపు మీ మనసెప్పుడు మళ్లింది? ఎందుకు మళ్లింది?
క్రికెట్‌ని నేనెప్పుడూ కెరీర్ ఆప్షన్‌లా చూడలేదు. పదమూడేళ్ల వయసులో అనుకుంటా.. 'నువ్వేమవుదామనుకుంటున్నావ్?' అనడిగితే 'ఏమయ్యేదేమిటి? యాక్టర్‌ని కాకుండా ఏమవుతాను?' అనుకున్నా. అయితే ఏమవుతావని అడిగినప్పుడు నాకు కొంచెం కన్‌ఫ్యూజన్ వచ్చింది. క్రికెట్ కోచింగ్‌కు వెళ్లేప్పుడు నాన్నగారు ఈ మాట అడిగారు. 'అరెరే. నాకు ఆప్షన్ కూడా ఉందా?' అనుకున్నా. మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో స్పోర్ట్స్‌ని ఎక్కువగా ఇన్‌వాల్వ్ చెయ్యరు. దాంతో నేను చాలా ఫ్రస్టేట్ అయ్యేవాణ్ణి. నాకు ఆటలంటే పిచ్చి, ప్రాణం. ఇప్పుడూ ఆడుతుంటా. ఆస్ట్రేలియాలో క్రికెట్, చదువు ఒకే స్కూల్లో ఉండటంతో హాయిగా రెండేళ్లు ఆడుతూ, చదువుకున్నా. టెన్త్ తర్వాత ఇంటర్మీడియేట్ ఇక్కడే చదివాను. అప్పుడే డాన్స్ క్లాసులకు వెళ్లాను. ఆ తర్వాత యాక్టింగ్ కోర్సు కోసం లాస్ ఏంజిల్స్‌కు వెళ్లాను. మూడేళ్ల డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను.
ఏ వయసు నుంచీ సినిమాలు చేద్దామనుకున్నారు? ఎప్పట్నించి స్క్రిప్టులు వింటున్నారు?
పోయినేడాది నుంచే స్క్రిప్టులు వింటూ వస్తున్నా. ఎప్పుడు ఏ స్క్రిప్ట్ దొరుకుతుందా, ఎప్పుడు మొదలుపెడదామా అని ఎదురుచూస్తున్నా. అయితే ఫలానా వయసులోనే సినిమాల్లోకి రావాలని ఫిక్సవలేదు. హడావిడిగా సినిమా చేయాలని అనుకోవట్లేదు. సినిమాల్లోకి రావాలని ఫిక్సయ్యాకే స్క్రిప్టులు వినటం మొదలుపెట్టా. రెండు నెలల క్రితమే ఓ స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశా. కొత్త డైరెక్టర్ కాదు.
దేవా కట్టా అని వినిపిస్తోంది..
దేవా కట్టా ఏమిటి.. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి నెలా ఒకటో తారీఖు నాకో ఫోన్ వస్తుంది. ఏంటి శ్రీను వైట్లనా? ఏంటి త్రివిక్రమా? ఏంటి దేవా కట్టానా? సంపత్ నందా? అని అడుగుతారు. ఆఖరుకి శంకర్ పేరు కూడా వినిపించింది. అదసలు నాకు తెలీనే తెలీదు. ఎక్కువగా మాత్రం త్రివిక్రమ్, శ్రీను వైట్ల పేర్లు వినిపిస్తున్నాయి నాకు. శ్రీను వైట్లను 'కింగ్' సినిమా అప్పుడు కలవడం తప్పితే, మళ్లీ ఇంతదాకా కలవనే లేదు. ఇలాంటి వదంతులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయ్. తాతయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో 'మనం' రెండున్నర నెలలు ఆలస్యమైంది. దాంతో నా సినిమా కొంచెం వాయిదా పడింది. లేకపోతే ఈ పాటికి అనౌన్స్ చేసేవాణ్ణి. జూన్ పదిలోగా అనౌన్స్ చేస్తాను. అది కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్. లవ్ స్టోరీ మేళవించిన యాక్షన్ ఎంటర్‌టైనర్స్. డాన్సులు, ఫైట్లకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఫైట్లను కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు స్క్రిప్ట్ క్లైమాక్స్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడే నేను ఆ డైరెక్టర్ పేరు అనౌన్స్ చేసి, రేపు అది వర్కవుట్ కాకపోతే, ఆ సినిమా కేన్సిల్ అయ్యిందనే టెన్షన్ అస్సలు వద్దు నాకు. ఈ శుక్రవారం ఫైనల్ వెర్షన్ వినబోతున్నా. అది నాకు నచ్చితే వెంటనే అనౌన్స్ చేద్దామనుకుంటున్నా.
అది సొంత బేనర్‌లోనే ఉంటుందా?
అవును. మాకు ఏ రిస్కూ తీసుకోవాలని లేదు. నేను ప్రత్యేకించి ఏ నిర్మాతను ఉద్దేశించి చెప్పటం లేదు కానీ, ఈ మధ్యన కొంతమంది నిర్మాతలు బడ్జెట్ ఒకటైతే, ఎక్కువ చేసి చెబుతున్నారు. నా మొదటి సినిమాని నాన్న దగ్గరుండి కేర్ తీసుకుందామని అనుకుంటున్నారు. అన్నయ్య చేసిన 'జోష్' సినిమా ఇంకా బాగా ఉండి ఉండాలని ఇప్పటికీ ఉంది మాకు. మేం ప్రొడ్యూస్ చేస్తే ప్రతి రూపాయీ తెరమీద కనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటామని తెలుసు. స్క్రిప్ట్ అనేది ఎంత డిమాండ్ చేస్తే, మనం అంత ఖర్చుపెట్టుకోవచ్చు.
మీ విషయంలో నాన్నగారి ప్రమేయం ఏమైనా ఉంటుందా?
స్క్రిప్ట్ ప్రతి దశలోనూ నాన్న ప్రమేయం ఉంది, ఉంటుంది. ప్రతి దశలోనూ ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆయన సరేననకుండా నేనేదీ చెయ్యను. డెఫినెట్‌గా ఆయనిచ్చినంత స్వేచ్ఛ ఎవరూ ఇవ్వరు. స్వేచ్ఛ ఇవ్వకపోతే, నేనొక తోలుబొమ్మలా మిగిలిపోతాననేది ఆయన అభిప్రాయం. స్వేచ్ఛ ఇవ్వకపోతే మనం కుంచించుకుపోతాం. అందుకు ఆయనకు థాంక్స్. చాలా చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఆయన సలహాలను సంతోషంగా స్వీకరిస్తాను. శుక్రవారం స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ వినగానే ఆయనకు వినిపిద్దామనుకుంటున్నా. నా సినిమా 2015లో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
అఖిల్ అమ్మ కొడుకా? నాన్న కొడుకా?
సినిమాలకు వచ్చేసరికి నాన్న కొడుకుని. ఇంట్లో అమ్మ కొడుకుని. అమ్మ గైడెన్స్ ఎక్కువే. నాన్న సినిమాలతో బిజీ కాబట్టి అమ్మతో గడిపినంత సమయం నాన్నతో గడపలేదు. నాన్న షూటింగ్‌కు వెళ్లి సాయంత్రం వచ్చేవారు. కలిసి డిన్నర్ చేసేవాళ్లం. హాలిడేస్‌కి ఎక్కడికైనా వెళ్లేవాళ్లం. ప్రతి ఇంట్లో మాదిరిగానే అమ్మతో నాకు అనుబంధం ఎక్కువ. నాన్నతో చెప్పడానికి భయపడే విషయాలను అమ్మతో చెప్పేవాణ్ణి. తర్వాత్తర్వాత అనుభవంలో నాన్న కూడా అమ్మలాగా సన్నిహితంగా ఉంటారనీ, ఎంకరేజ్ చేస్తారనీ అర్థమైంది. నేనేం చేసినా అమ్మ, నాన్న ఇద్దరూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఏం చేయాలనుకుంటే అది చెయ్యమనేవాళ్లు. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. ఇద్దరితో నాకు మంచి సన్నిహిత అనుబంధం ఉంది. అమ్మ బ్లూక్రాస్‌కు జీవితం అంకితం చేసేసింది. జంతువుల కోసం అంత సేవ చేయడం మామూలు విషయం కాదు. ఖరీదైన బట్టలనేవి వేసుకోకుండా, సింపుల్‌గా ఉంటుంది. తన బర్త్‌డే కోసం నేనో గిఫ్ట్ కొందామనుకుంటే అదేమీ వద్దనీ, ఆ డబ్బుని బ్లూక్రాస్‌కు విరాళంగా ఇస్తే తనెంతో సంతోషిస్తాననీ చెప్పింది. అలాంటి అమ్మకు కొడుకైనందుకు ఎంతో ఆనందంగా ఉంది.
'సిసింద్రీ' సినిమాని చూసిన తొలి జ్ఞాపకం?
ఊహ తెలిశాక ఏడేళ్ల వయసులో అనుకుంటాను, 'సిసింద్రీ' చూసి, ఆ కేరక్టర్ చేసింది నేనేనని నమ్మేవాణ్ణి కాను. అమ్మ 'నువ్వే.. నువ్వే.. నువ్వే' అని నా మైండ్‌లో పెట్టిన తర్వాతే నమ్మాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఎక్కువగా చూస్తుండేవాణ్ణి. చూస్తూ నవ్వేవాణ్ణి. ఆ సినిమాని కనీసం ముప్పైసార్లన్నా చూసుంటాను. కానీ ఇప్పటికీ నన్ను 'సిసింద్రీ' అని పిలుస్తుండటం నాకు నచ్చదు. 'మనం' చివరలోనూ నా పేరుకు ముందు 'సిసింద్రీ' అని వాడారు. సుప్రియ అక్కకు చెప్పాను, ఇంకా 'సిసింద్రీ' ఏమిటని. 'లేదు. లేదు. పెట్టాలి' అని పెట్టింది.
మీరు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారు?
కేరక్టర్ ప్రధాన చిత్రాలంటే ఇష్టం. 'ఖలేజా'లో మహేశ్ కేరక్టర్ తప్ప ఇంకేమీ చూడను. 'జులాయి'లో బన్ని కేరక్టర్ తప్ప మిగతా సినిమాని పెద్దగా పట్టించుకోను. ఎప్పుడూ చూడని కేరక్టర్లు చూడటమంటే ఇష్టం. బహుశా నాకు అలాంటి కేరక్టర్లు ఇష్టం కాబట్టి అలాంటి సినిమాలను ఇష్టపడతానేమో. నాకూ బాగా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉంది. నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి. నా సినిమా విడుదలై ఫలానా దాంట్లో అఖిల్ సరిగా చేయలేదంటే, నన్ను నేను నిరూపించుకోవడానికి ఆ తర్వాత డెఫినెట్‌గా దాన్నే ట్రై చేస్తాను.
మీ కుటుంబంలో మీపై బాగా ప్రభావం చూపిన వ్యక్తి?
యాక్టర్‌ని కావాలనుకున్నా కాబట్టి డెఫినెట్‌గా నాన్నే. తాతయ్య స్టార్‌డమ్‌లో ఉన్నప్పుడు నేను చూడలేదు. నాన్న స్టార్‌డమ్‌లో ఉన్నప్పుడు నేను చూశా కాబట్టి, 'కింగ్' లాంటి ఆయన ఉన్నత స్థాయిని చూశా కాబట్టి, నేను యాక్టర్‌ని అవుతున్నా కాబట్టి, ఇప్పుడు ఆయన నుంచే సలహాలు తీసుకుంటున్నా కాబట్టి ఆయన ఎక్కువ ప్రభావితం చేశారు. 'శివ' వంటి సినిమాల్లో అమ్మని చూసినప్పుడు ఫన్నీగా అనిపించేది. యాక్టర్‌గా నాన్నే నచ్చేవారు. కానీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చూశాక అమ్మ మీద రెస్పెక్ట్ పెరిగింది.
ఇంటర్వ్యూ: బుద్ధి యజ్ఞమూర్తి

మీ కుటుంబం బయటి హీరోల్లో ఎవరంటే మీకిష్టం?
బన్ని. వ్యక్తిగా అతనంటే ఇష్టం. ఈ మధ్య తను చాలా సన్నిహితమయ్యాడు. నాకు మరో అన్నయ్యలా ఉన్నాడు. సలహాలిస్తుంటాడు. అలాగే నితిన్ కూడా. హీరోలందరితోనూ నాకు మంచి రిలేషన్‌షిప్ ఉంది. బయటివాళ్లలో ఫేవరేట్ హీరో అని ప్రత్యేకంగా ఎవరూ లేరు. సినిమా సినిమాకీ అది మారుతుంటుంది. 'ఖలేజా'లో మహేశ్ భలే నచ్చాడు. 'దూకుడు'లో కంటే 'బిజినెస్‌మేన్'లో అతని పర్ఫార్మెన్స్ విపరీతంగా నచ్చింది. '1'లో భలే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే నాకు పర్ఫార్మెన్సులు నచ్చుతుంటాయి. హీరో పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ సినిమా నచ్చేస్తుంది. 'బుజ్జిగాడు' ఫ్లాపయినా, ప్రభాస్ భలే నచ్చాడు. 'వేదం' కమర్షియల్‌గా అంతగా ఆడలేదు. బన్నీకి ఫోన్‌చేసి 'బ్రదర్. నువ్వే బెస్ట్' అని చెప్పాను. అలాగే 'జులాయి'లో, 'రేసుగుర్రం'లో బన్ని బాగా నచ్చాడు. ఏ హీరో అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చితే నచ్చుతాడు.

చైతన్యతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది?
ఇద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. కలిసి పార్టీలు చేసుకుంటాం. కలిసి బయటకు వెళ్తాం. కలిసి ప్రయాణాలు చేస్తాం. తనకి నలుగురైదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లతో తప్ప వేరేవాళ్లతో అంత త్వరగా కలవడు. రిజర్వ్‌డ్ పర్సన్. తన స్నేహితులందరూ నాకూ చాలా సన్నిహితం. మా మధ్య ఏడెమినిదేళ్ల వయసు తేడా ఉన్నా, అలా ప్రవర్తించం. తను పెద్దవాడైనా నన్ను స్నేహితుడిలాగే చూస్తాడు. ఎప్పుడైనా సలహాలు ఇస్తుంటాడు. మా మధ్య ఎప్పుడూ గొడవలు అనేది రాలేదు.



©www.myreviews4all.blogspot.com