Friday, May 21, 2010

Truly Amazing article on Mani ratnam....in telugu

on the best article which i read.. idhi nenu rayaledu. naku nacchindhi ani nenu chadivina article mee kosam post chesthunna..click on read more to read the article.

అవును..మణిరత్నం ముమ్మాటికీ విలన్..
ప్రేక్షకులు తమ చూపులను వెండితెరపై నుంచి పక్కకు తిప్పుకోనివ్వకుండా ‘కట్టిపడేస్తాడు’
నటుడు ఎవరైనా, పాత్రలోకి పరకాయప్రవేశం చేయించేస్తాడు. వారి నుంచి కావాల్సినంత నటన ‘దోచుకుంటాడు’
నిజమే..మణిరత్నం..సినిమాను ప్రేమిస్తాడు..అందుకోసం పరితపిస్తాడు..తన ఊహలకు దృశ్యరూపం ఇవ్వడం కోసం నటులను, సాంకేతిక నిపుణులను ‘హింసిస్తాడు’
అవును..పనికి సంబంధించినంత వరకు మణిరత్నం విలనే..నిజమే..
అంతటివాడు కాకుంటే.. మాఫియా లీడర్ జీవితగాధను పట్టుకుని, అంత ఆర్ధ్రంగా ఎలా చెప్పగలడు..దేశభక్తిని సైతం..రొమాంటిక్ ఫ్యామిలీ కథకు ఎలా ముడిపెట్టి, రంగరించి పోయగలడు. కేవలం ఒక మానసిక వైకల్యం వున్న బాలిక చుట్టూ తిరిగే కథను తీసుకుని, ప్రేక్షకులను ఎలా సమ్మోహితులను చేయగలడు..అంతెందుకు.. బాంబు లు..దాడులు..మృతదేహాలు మినహా మరేమీ ఊహించలేని ఉగ్రవాద కథల నేపథ్యంలో అందమైన సినిమాలు ఎలా తీయగలడు...ఎప్పుడు చనిపోతారో తెలియని నాయికీ నాయకులను కథను తీసుకుని తెలుగువారి కోసం గీతాంజలి ఎలా అందించగలడు. ఐశ్వర్యరాయ్, అభిషేక్‌బచ్చన్, సూర్య, విక్రమ్,లాంటి మహామహులతో మూడు భాషల్లో పాత్రధారులను అటూ ఇటూ మార్చి మరీ, భారీ సినిమాను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తీసి చూపించడం మరెలా సాధ్యం? ఇలా అన్నీ ఏటికి ఎదురీదే లక్షణాలే. అందుకే మణిరత్నం నిజంగా రావణాసురుడు..పది తలలతో, పది రకాలుగా, పదిసార్లు ఆలోచించి, పదుగురు మెచ్చేలా, వెండితెర నిండుగా దృశ్యకావ్యాన్ని రచించడం ఆయనకే సాధ్యం.
****
భారతీయ చలన చిత్ర రంగంలో ఎందరో దిగ్ధర్శకులు వున్నారు. ఎందరో ఆర్ట్ ఫిలిం మేకర్లు, కమర్షియల్ డైరక్టర్లు, కళాత్మక చిత్రాలు అందించిన వారు, భారీగా చిత్రాన్ని రూపొందించగల సత్తా వున్న వారు..ఇలా ఎందరో. కానీ మణిరత్నం స్టయిల్ మాత్రం అనితర సాధ్యం. భావోద్వేగాలను తెరకెక్కించడంలో కానీ, సన్నివేశానికి ఒక గ్రిప్‌ను తీసుకురావడంలో కానీ, పాటలకు గ్రేస్‌ను ఆపాదించడంలో కానీ మణి స్టయిల్‌ను నిర్వచించడం కష్టం. సినిమా అంటే అదో తపస్సులా భావిస్తాడు ..అందుకే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల గుండెలకు హత్తుకుంటుంది. ఆ సన్నివేశం ఏ తరహాది అన్న బేధం లేదు. అది రొమాంటిక్ కావచ్చు..ఎమోషన్ కావచ్చు..విషాదం కావచ్చు..వినోదం కావచ్చు..ఏదైనా దానిపై మణి ముద్ర పడుతుంది.
****
1983లో అనిల్‌కపూర్‌తో పల్లవి-అనుపల్లవి చిత్రంతో ప్రారంభమైన మణిరత్నం ప్రస్థానంలో ప్రతీ చిత్రమూ..ఓ వైవిధ్యమే. ప్రేమ-పెళ్లి నేపథ్యంలో సాగే వౌనరాగం(1986), ముంబాయి మాఫియా లీడర్ జీవితగాధ ఆధారంగా నాయకుడు(1987),మానసిక వైకల్యం వున్న పాప, ఆమె తల్లితండ్రుల ఆవేదన నిండిన అంజలి(1990), కర్ణుడి కథ గుర్తుకుతెచ్చే దళపతి(1991) ఇవన్నీ ఒక ఎత్తు. వర్తమాన రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే రోజా, బొంబాయి, ఇద్దరు, అమృత, యువ ఒక ఎత్తు. రోజా చిత్రం నుంచి మణిరత్నం దృష్టి కొంచెం మళ్లింది. సున్నితమైన, వివాదాస్పదమైన కథాంశాలను తీసుకుని, తనదైన శైలిలో తెరకెక్కించడం ప్రారంభించాడు. మధ్యలో ఒక్క గురు మాత్రమే దీనికి మినహాయింపు. సినిమా ఏదైనా, విషయం ఏదైనా ప్రేక్షకుడి గుండెకు సూటికా తాకేటట్టు సన్నివేశాలను అల్లుకోవడం, వాటికి సూటైన సంభాషణలు రాసుకోవడంలో ఆయనకు అంటూ ఒక స్టయిల్ వుంది. అలాగే కెమేరామెన్ ఎవరైనా, ఎడిటింగ్ ఎవరు చేసినా, సన్నివేశాల ఫ్రేమింగ్ కానీ, వాటి బిగువు కానీ మణిరత్నం స్టయిల్‌లో ఒదిగిపోవాల్సిందే.
****
చాలా కాలంగా సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సినిమాలు తీస్తున్న మణి ఈసారి తన కిష్టమైన రామాయణ గాధ నేపథ్యంలో సినిమా చేయడానికి పూనుకున్నారు. కథను గోప్యంగా వుంచినా, రామాయణాన్ని ఆధునిక కాలానికి, ఆలోచనలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారన్న ఊహాగానాలైతే వున్నాయి. అందుకు తగ్గట్లే సినిమా గురించి మణిరత్నం..మానవుల్లో దానవులు..దానవుల్లో మానవులు వుండరా అన్న రీతిలో తన ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు పరిపరి విధాల, పదివేల ఆలోచనల, పది రకాల గొంతులతో ప్రవర్తించే మనిషే అసలైన రావణుడా? పదిమంది దానవుల్లో వెదికితే రాముడుండడా అన్నది కూడా మణి రేకెత్తించే ప్రశ్న.
వినవస్తున్న వివరాల ప్రకారం.. దేవ్ ఒక పోలీస్ అధికారి, రాగిణి అనే క్లాసికల్ డాన్సర్‌ను ప్రేమిస్తాడు. వారిద్దరికి వివాహం జరుగుతుంది. ఇదిలా వుండగా, ఒక ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడిపే వీరా అనే వ్యక్తి ఆటకట్టించాలనుకుంటాడు దేవ్. ఒకదశలో ఈ ముగ్గురూ అడవిపాలవుతారు. ఆ అడవిలో ఈ ముగ్గురి నడుమ జరిగిన సంఘటనలు, సంఘర్షణల సమాహారమే చిత్ర కథ.
***
సినీ రంగ హేమాహేమీలనదగ్గ, రెహమాన్ (సంగీతం),సంతోష్‌శివన్ (్ఫటోగ్రఫీ), శ్రీకరప్రసాద్ (ఎడిటింగ్), ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. నృత్య కళాకారుడు దేబూ ఈ సినిమా గీతాలకు నృత్యదర్శకత్వం వహించారు. సవ్యసాచి ముఖర్జీ ఈ సినిమాలో ఐశ్వర్య దుస్తులను డిజైన్ చేసారు. ఈ చిత్రం కోసం మణి 2008 నుంచీ ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఒక చిత్ర నిర్మాణానికి మూడేళ్ల కాలం అంటే అది చిన్న విషయం కాదు. తనకు నచ్చేవరకు, తను అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చేవరకు తీసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ తీసాడు. కేరళ అడవుల్లో చిత్రీకరణ కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అక్కడి అటవీ శాఖ పలు షరతులు విధించి మరీ, చిత్రీకరణకు అనుమతి ఇచ్చింది. సిగరెట్లు కాల్చకూడదనీ, ప్లాస్టిక్ సంచులు వాడకూడదనీ, పరిమిత సంఖ్యలో జనం, వాహనాలు మాత్రమే వుండాలనీ, ఇలా ఏన్నో. అన్నింటికీ తట్టుకుని, కేరళలో, ముంబాయికి సమీపంలోని ఘాట్‌ల్లో, ఇంకా దేశంలోని పలుప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించాడు.
****
ఇంతలా కష్టపడ్డ మణి శ్రమ వృధాపోలేదు. ఈ సినిమ ప్రోమోలు ఇప్పటికే జనంలో విపరీతమైన క్రేజ్‌ను సంతరించుకున్నాయి. ఈ సినిమా క్రేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లింది. వచ్చేనెల జనం ముందుకు వస్తోంది. కచ్చితంగా ఇది మణిరత్నం కీర్తికిరీటానికి మరో మణో, రత్నమో అయి తీరుతుంది.
source: vennela

No comments: