Friday, July 22, 2011

Vikram / Nanna movie review in Andhrabhoomi / vennela edition


Click on read more to read the review

చాన్నాళ్ల తరువాత థియేటర్లలో కంటతడి పెడుతున్న ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ఎప్పుడో సినిమాలు వచ్చిన కొత్తలో, సినిమాను వాణిజ్యపరంగా కాక, జనాన్ని స్పందింపచేసే సాధనంగా చూసిన రోజుల్లో కావచ్చు..ఇటువంటి సన్నివేశాలు కనిపించేవి. థియేటర్లలో కన్నీళ్లు వరదగా మారినట్లు కొండొకచో, కార్టూన్లు కూడా పత్రికల్లో వచ్చేవి. మరీ ఇంతగా కాకున్నా, గతవారం విడుదలైన ‘నాన్న’ సినిమా జనం గుండెల్ని కాస్త గట్టిగానే పట్టి కుదిపింది. కాకలుతీరిన నటుడు విక్రమ్, అసలు సినిమా అంటే అవగాహన వుందా అన్న అనుమానం వచ్చే అయిదేళ్ల వయసున్న పాప సారా కలిసి అందించిన నటనతో, జనం చిత్రంతో మమేకమయ్యారు.
సినిమా త్రెడ్ గురించి చెప్పుకునే ముందు ఓ సంగతి చెప్పుకోవాలి. విషయం ఏదైనాసరే, దర్శకుడు చెప్పాలనుకునే విధానాన్ని బట్టే సినిమా వుంటుంది. చాన్నాళ్ల క్రితం ‘చూడాలని వుంది’ అనే సినిమా వచ్చింది. భార్య చనిపోయిన తరువాత, తన బిడ్డను మామగారు తీసుకుపోతే, ఆ తండ్రి ఊరు గాని ఊరు చేరి వీరోచితంగా పోరాడి తిరిగి తెచ్చుకున్న కథ అది. హీరో వీరుడు కాబట్టి అలా పోరాడాడు. హీరో శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా లేకుంటే..అదే లైన్‌తో వచ్చింది. ‘ఐయామ్ శామ్’ అనే ఇంగ్లీషు సినిమా. మానసిక ఎదుగుదల సరిగా లేని వ్యక్తి బిడ్డ పరాయికుటుంబానికి చేరితే, ఆ తండ్రి ఓ లాయర్ సహాయంతో ఆ బిడ్డను తిరిగి పొందిన కథ. ఇప్పుడు సరిగ్గా ఇదే కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు విజయ్ నాన్న కథను అల్లుకున్నాడు. కథనే కాదు పలు సన్నివేశాలను, హీరో మానరిజమ్స్‌ను కూడా మాతృక నుంచి తీసుకున్నాడు. అది వేరేసంగతి.
మానసికంగా అంతగా ఎదగని కృష్ణ (విక్రమ్) ఊటీ దగ్గరి అవలాంచిలోని చాక్‌లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. అతడి భార్య ఓ బిడ్డను కని మరణిస్తుంది. పసిపాప వెనె్నల (సారా)ను తన సహ ఉద్యోగుల సాయంతో సాకి, స్కూల్లో చదివిస్తుంటాడు. ఉన్నట్లుండి కృష్ణ కూతురు వెనె్నలను తాత, మరదలు తీసుకుని వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో కృష్ణకు అండగా నిలుస్తుంది ప్రాక్టీస్ అంతగా లేని లాయర్ (అనుష్క). ఆమెకు సవాల్‌గా నిలుస్తాడు పేరుమోసిన క్రిమినల్ లాయర్ నాజర్. ఈ కేసు పరిష్కారం ఏ దిశగా సాగిందన్నది మిగిలిన కథ.
ఇక సినిమా మంచి చెడ్డల విషయానికి వస్తే కథను నేటివిటీకి అనుగుణంగా మార్చడంలో, సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించడంలో దర్శకుడు విజయ్ చాకచక్యం ప్రదర్శించినా, కొన్ని లోపాలైతే వున్నాయి. కానీ అవి జనానికి పెద్దగా పట్టవు. మానసికంగా ఎదుగుదల లేని వ్యక్తిని, గొప్పింటి అమ్మాయ ప్రేమించి పెళ్లి చేసుకోవడం, అదీ విశాఖ నుంచి అవలాంచీ వచ్చి..పైగా ఆమె మరణం వెనుక కృష్ణ తెలివితక్కువతనం ఏ మేరకు కారణం అన్న విషయాలు దర్శకుడు దాటవేసాడు. పైగా అసలు ఆమె మరణం కారణంగానే పాపను అతన్నించి దూరం చేయడం అన్న పాయంట్ ముడిపడి వున్నపుడు, ఆ సంఘటనను కాస్త విస్తరించి వుంటే బాగుండేది. అయితే దర్శకుడి ప్రతిభ అంతా సినిమా పొడవునా సుతిమెత్తని కామెడీని అంతర్లీనంగా నడుపుతూ వస్తూనే, సినిమా సీరియస్‌నెస్ చెడకుండా, తయారుచేసుకున్న స్క్రిప్ట్‌లో కనిపించింది. సినిమా మొదటి సగం కాస్త నీరసంగా, డ్రాగ్‌గా నడిచింది అనుకునేసరికి, రెండవ సగంలో కాస్త స్పీడ్ చేసి, దర్శకుడు ఆ మైనస్‌ను ప్లస్ చేసుకున్నాడు. ముఖ్యంగా జనానికి బోర్ కొట్టే కోర్టు సన్నివేశాలను కూడా కాస్త జాగ్రత్తగానే ప్లాన్ చేసుకున్నాడు. హోటల్లో వెదికే సన్నివేశం కాస్త లెంగ్తీ అయిందనిపించింది. అలాగే అనుష్క, విక్రమ్‌ల నడుమ పాట చిత్రీకరణ అయితే బాగుంది కానీ, లేకుంటేనే బాగుండేదేమో. కేవలం ఒక్క అనుకోని కౌగిలింతకే ఓ లాయరైన మహిళ డ్రీమ్‌లోకి వెళ్లినట్లు చూపించడం అంతగా సమర్ధించుకోలేని విషయం. పైగా అంతవరకు వారి నడుమ అటువంటి భావసాన్నిహిత్యం ఏమీ వుండదు కూడా. దర్శకుడి తరువాత సినిమాకు వెన్నుదన్నుగా నిల్చినవి ఫొటోగ్రఫీ (నిరవ్‌షా), నేపథ్యసంగీతం (జి.వి ప్రకాష్‌కుమార్). సినిమాలో ఊటీ సన్నివేశాలు చాలా పొయిటిక్‌గా కనిపించాయి. చాలా వరకు సన్నివేశాలు గజిబిజిగా లేకుండా, హాయగా వుండేందుకు ఫొటోగ్రఫీ తోడయంది. సినిమాను మరింత హృదయానికి హత్తుకునేలా చేయడంలో జీవీ ప్రకాష్ నేపథ్యసంగీతం బాగా ఉపకరించింది. అయతే అతనిపై ఇళయరాజా ప్రభావం బాగా వుందనిపించింది కూడా.
ఇక నటీనటుల్లో మొదటి మార్కు విక్రమ్ కన్నా బేబీ సారాకే వేయాలి. ఎందుకంటే విక్రమ్ పరిణితి చెందిన నటుడు. పైగా ఐ యామ్ శామ్ చూసి ప్రభావితం చెందినట్లు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చేయి, నోరు, ఇతర హావభావాల్లో. కానీ బేబీ సారా అలా కాదు. ఐ యామ్ శామ్‌లో ఆ పాప పాత్రకు అంత డెప్త్ కనిపించదు. కానీ ఈ చిత్రంలో విక్రమ్‌తో సరితూగే విధంగా ఆ పాప నటించకుంటే, సినిమా ఎంతమాత్రం రక్తికట్టి వుండేది కాదు. ముఖ్యంగా క్లయిమాక్స్ సన్నివేశంలో. అయితే ఇదే సమయంలో ఆ పాప ప్రవర్తన వయస్సుకు మించినట్లు అనిపించినా, సినిమా రీత్యా దానిని పట్టించుకోనవసరం లేదు. ఇక అనుష్క, సంతానం, అమలాపాల్, సచిన్ ఖేడ్కర్ తదితరులు ఎవరి పాత్ర మేరకు వారు నటించారు. తెలుగు నటులను ఇతర భాషల దర్శకులు సరైన పాత్రలకు వినియోగించుకుంటున్న తీరు ఇందులో అనుష్క, సురేఖావాణిలను చూసాక మరోసారి తెలుస్తుంది.
నిన్న మొన్నటి సినిమాలే బాగున్నాయి..ఇప్పటి సినిమాలు జనాన్ని చెడగొడుతున్నాయి..అని ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పేవారు, పత్రికలకు కార్డులు రాసేవారు..ఎప్పుడో ఒకసారి వచ్చే ఇటువంటి సినిమాలను చూస్తే, అప్పుడప్పుడైనా మంచి సినిమాలు వస్తుంటాయి.

©www.myreviews4all.blogspot.com

1 comment:

Ashok Sms King said...

too good article

nenu kuda chusa anna movie

chaaala bavundi

nenu kuda edchesa movie climax lo